లాక్ డౌన్ లో జీతాలు చెల్లించకున్నా చర్యలొద్దు: సుప్రీంకోర్టు కీలక ఆదేశం!

  • జూలై 31 వరకూ చిన్న కంపెనీలకు ఊరట
  • రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవాల్సిన సమయం ఇది
  • యాజమాన్యాలు, ఉద్యోగులతో చర్చలు జరపండి
  • వేతనాల విషయంలో వివాదం వద్దన్న సుప్రీంకోర్టు
దేశంలోని ప్రైవేటు సంస్థలకు సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఇండియాలో లాక్ డౌన్ అమలుకాగా, ఆ సమయంలో ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. కంపెనీలు మూతపడినప్పటికీ, మానవతా దృక్పథంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విజ్ఞప్తి చేశారు. కాగా, మార్చి 29న కేంద్రం తన ఆదేశాల్లో తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిందేనని ఆదేశించిన సంగతి తెలిసిందే.  దీనిపై పలు ప్రైవేటు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కీలక తీర్పు వెలువడింది.

ప్రైవేటు సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, లాక్ డౌన్ సమయంలో మూడబడిన కంపెనీలు, వేతనాలు ఇవ్వకుంటే, వారిపై జూలై నెలాఖరు వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వేతనాలు చెల్లించే విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు..  ఉద్యోగులు, యాజమాన్యాలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని, రాష్ట్రాల లేబర్ కమిషనర్ల సమక్షంలో ఈ చర్చలు జరగాలని ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్రం తన అభిప్రాయం చెప్పాలంటూ, నాలుగు వారాల సమయం ఇస్తూ, నోటీసులను జారీ చేసింది.

ఇక ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షా, "భారత పరిశ్రమ రంగానికి కార్మికులు ఎంత ముఖ్యమో యాజమాన్యాలు కూడా అంతే ముఖ్యం. వారి మధ్య నెలకొన్న సమస్యలను వివాదంగా చూడరాదు. ఏ వివాదమూ లేకుండా 50 రోజుల వేతనంపై నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలదే" అని వ్యాఖ్యానించారు.

కాగా, తాము వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని, తామే తీవ్ర నష్టాల్లో ఉన్న వేళ, ఉద్యోగులకు ఎలా జీతాలు ఇస్తామని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేన్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనితో పాటు లూధియానా హ్యాండ్ టూల్స్ అసోసియేషన్, ఫికస్ ప్యాక్స్, తదితరులు కోర్టును ఆశ్రయించారు.


More Telugu News