ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిపై కోపంతో ఆమె కూతుర్ని గొంతుకోసి చంపిన యువకుడు

  • మేడ్చల్ జిల్లా పోచారంలో ఘటన
  • చిన్నారి ప్రాణం తీసిన ఫేస్ బుక్ స్నేహం
  • పెడత్రోవ పట్టిన స్నేహాలు
  • ఉన్మాదిలా మారిన యువకుడు
అనైతిక స్నేహాలు ఎంతటి విపరిణామాలకు దారితీస్తాయో చెప్పేందుకు ఈ ఘటన ఓ నిదర్శనం. ఫేస్ బుక్ లో పరిచయమైన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండడం చూసి ఓ యువకుడు ఆమె కూతుర్ని గొంతుకోసి చంపాడు. తెలంగాణలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....అనూష అనే యువతి తన కుమార్తె ఆద్యతో కలిసి మేడ్చెల్ జిల్లా పోచారంలో ఉంటోంది. ఆమెకు కరుణాకర్ అనే యువకుడితో మూడు నెలల కిందట ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

అయితే, కొన్నిరోజులుగా అనూష... రాజశేఖర్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉండడంతో కరుణాకర్ ఆవేశంతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలో, కరుణాకర్ నేటి మధ్యాహ్నం అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ రాజశేఖర్ ఉండడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ రాకతో రాజశేఖర్ ను అనూష బాత్రూంలో దాచింది. ఈ విషయం పసిగట్టిన కరుణాకర్ బాత్రూం నుంచి బయటికి రాకపోతే చిన్నారి ఆద్యను చంపేస్తానంటూ ఉన్మాదంతో రంకెలేశాడు. కానీ రాజశేఖర్ బయటికి రాకపోవడంతో అన్నంతపనీ చేశాడు.

అభంశుభం తెలియని ఆరేళ్ల ఆ చిన్నారి పాపను అత్యంత పాశవికంగా సర్జికల్ బ్లేడ్ తో గొంతుకోసం చంపేశాడు. దాంతో హడలిపోయిన రాజశేఖర్ బాత్రూం నుంచి వెలుపలికి రాగా, కరుణాకర్ అతడిపైనా దాడి చేశాడు. అయితే ఆ మృగం బారి నుంచి తప్పించుకున్న రాజశేఖర్ పరుగులు తీశాడు. అనంతరం కరుణాకర్ అదే బ్లేడ్ తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తస్త్రావం అవుతున్న కరుణాకర్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించిన పోలీసులు ఆద్య తండ్రి కల్యాణ్ కు ఈ ఘటనపై సమాచారం అందించారు. కాగా, కల్యాణ్, అనూష దంపతుల స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతం. వీరు గత రెండేళ్లుగా ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు అనూషను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News