సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

  • ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు
  • ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం మేరకు వెల్లడి
  • www.cbse.nic.inలో ఫలితాలు  
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు కావడంతో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా, ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం మేరకు బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను‌ www.cbse.nic.in, www.cbseresults.nic.in, www.results.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు తెలుసుకోవచ్చు.

అంతేగాక, cbse10 అని టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌ నంబరు టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి అడ్మిట్‌కార్డు ఐడీ నంబరు వివరాలను 7738299899 నంబరుకు.. రిజిస్టరు చేసుకున్న‌ మొబైల్‌ నంబరు నుంచి ఎస్‌ఎంఎస్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. అలాగే, మార్కుల జాబితాతో పాటు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు వంటి వాటిని http://digilocker.gov.in ద్వారా పొందవచ్చు.

  ఈ ఏడాది మొత్తం 18,73,015 విద్యార్థులకు గాను 17,13,121 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం  91.46గా ఉంది. ఇది గత ఏడాది కన్నా 0.36 శాతం అధికం. గత ఏడాది 91.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఇప్పటికే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.


More Telugu News