రాబోయే కాలం కరోనాకు బాగా అనుకూలం: ఐఐటీ-ఎయిమ్స్

  • వర్షాలతో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
  • తక్కువ ఉష్ణోగ్రతల్లో వైరస్ విజృంభిస్తుందంటున్న పరిశోధకులు
  • ఆ తర్వాత వచ్చే చలికాలంలో భీకరస్థాయిలో వైరస్ వ్యాప్తి
ప్రస్తుతం భారత్ లో వేసవి కాలం ముగిసి వర్షాకాలం ఆరంభమైంది. ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వర్షాకాలం ముగిసిన వెంటనే శీతాకాలం రానుండడంతో కరోనా వ్యాప్తిపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చల్లని వాతావరణంలో వైరస్ మరింత తీవ్రంగా విజృంభిస్తుందన్న ప్రచారమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ ఐఐటీ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

రుతుపవనాల సీజన్ పతాకస్థాయికి చేరినప్పుడు, చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్ లో అత్యంత భీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు వెల్లడించారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఆ తర్వాత వచ్చే చలికాలం వాతావరణ పరంగా వైరస్ మనుగడకు అత్యంత అనుకూలమని ఐఐటీ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినోజ్ తెలిపారు.

ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కరోనా వ్యాప్తి క్షీణతకు కారణమవుతుందని, కానీ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనుండడమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేసులు రెట్టింపు అయ్యే పరిస్థితులపై ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనం ద్వారా గుర్తించారు. వాతావరణంలో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే కరోనా కేసుల నమోదులో 0.99 శాతం తగ్గుదల కనిపిస్తుందని, కేసులు రెట్టింపయ్యే సమయం 1.13 రోజులకు పెరుగుతుందని వివరించారు.


More Telugu News