అమ్మాయి చెంపపై కొట్టిన పోలీసు... తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి!

  • ఝార్ఖండ్, సాహిబ్ గంజ్ ప్రాంతంలో ఘటన
  • జుట్టు పట్టుకుని లాగుతూ యువతిని కొట్టిన పోలీసు
  • కఠిన చర్యలకు ఆదేశించిన సీఎం హేమంత్ సోరెన్
ఎంత పోలీసు విధుల్లో ఉంటే మాత్రం... అధికారం ఉందిగదాని రెచ్చిపోతే ఏం జరుగుతుందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. నడిరోడ్డుపై ఓ యువతి చెంపను చెళ్లుమనిపించడంతో పాటు, ఆమె జుట్టు పట్టుకుని లాగిన ఓ పోలీసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, స్వయంగా ముఖ్యమంత్రే స్పందించి, అతనిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో జరిగింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, రోడ్డుపై బందోబస్తులో ఉన్న ఓ పోలీసు, ఆ దారిలో వచ్చిన ఓ యువతిని ఎందుకు వచ్చావని ప్రశ్నించి, ఆపై చెంపమీద ఒక్కటిచ్చాడు. అంతేకాదు... జుట్టు పట్టుకుని లాగాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన స్మార్ట్ ఫోన్ లో బంధించగా, అది సోషల్ మీడియాకు ఎక్కింది. సదరు పోలీసు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లగా, దాన్ని చూసిన ఆయన, రాష్ట్ర డీజీపీ ఎమ్ వీ రావుకు ట్యాగ్ చేస్తూ, వీడియోను షేర్ చేశారు. ఇటువంటి నీచమైన, అనుచిత ప్రవర్తనలను ఎంతమాత్రమూ భరించరాదని ట్వీట్ చేశారు. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు పోలీసును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన డీజీపీ, ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. 


More Telugu News