ఉత్తరప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్ హతం

  • గ్యాంగ్ స్టర్లను వేటాడుతున్న యూపీ పోలీసులు
  • ఇటీవలే వికాస్ దూబే ఎన్ కౌంటర్
  • పదేళ్లుగా దొరకని పాండే లక్నో శివారులో హతం
ఇటీవలే వికాస్ దూబే గ్యాంగ్ చేతిలో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్యాంగ్ స్టర్ల వేట మొదలుపెట్టారు. వికాస్ దూబే, అతడి అనుచరుల్లో కొందరిని ఇప్పటికే అంతమొందించిన యూపీ పోలీసులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్ స్టర్లను కూడా వదలడంలేదు. తాజాగా రాకేశ్ పాండే (హనుమాన్ పాండే) అనే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. లక్నో శివారులో అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులపై కాల్పులు జరిపాడని, అందుకే కాల్చి చంపాల్సి వచ్చిందని టాస్క్ ఫోర్స్ వివరించింది.

పాండే నేరచరిత్ర చాలా సుదీర్ఘమైనది. 1993 నుంచి నేర ప్రపంచంలో పాండే తన ఉనికి చాటుకుంటున్నాడు. 2005లో జరిగిన బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ఇతడు నిందితుడు. యూపీలోని కిరాతక గ్యాంగ్ లో ముక్తార్ అన్సారీ ముఠా ఒకటి. అన్సారీ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న పాండే గత కొన్ని దశాబ్దాలుగా యూపీ పోలీసులకు సవాలుగా మారాడు. పాండే తలపై రూ.1 లక్ష రివార్డు కూడా ఉంది. 2010లో పాండే అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, అప్పటినుంచి అతడ్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఎన్ కౌంటర్ లో చనిపోయాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ అమితాబ్ యశ్ వెల్లడించారు.


More Telugu News