రైనా కూడా ధోనీ బాటలోనే... అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై!

  • రిటైర్మెంటు ప్రకటించిన రైనా
  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
  • ప్రస్తుతం ఐపీఎలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న రైనా, ధోనీ
టీమిండియాకు విశేషంగా సేవలు అందించి, భారత క్రికెట్ చరిత్రలో తిరుగులేని విజయాలు సాధించిన అద్భుత కెప్టెన్ గా మన్ననలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన కాసేపటికే, మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు వెల్లడించాడు.

ధోనీ, రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం చెన్నైలో సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో ఉన్నారు. మరి వీరిద్దరూ తమ రిటైర్మెంటు గురించి పరస్పరం చర్చించుకున్నారో లేదో తెలియదు కానీ, వరుసగా ఒకరి వెంట ఒకరు రిటైర్మెంటు ప్రకటనలు చేసి భారత క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశారు.

ఓ దశలో ఫిట్ నెస్ కోల్పోయిన రైనా ఆ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయాడు. అడపాదడపా టీమ్ లోకి వచ్చినా మునుపటి లయ లోపించడంతో స్థానం పదిలపర్చుకోలేకపోయాడు. దానికితోడు యువ క్రికెటర్ల రాకతో రైనా ప్లేస్ ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించినా సెలెక్టర్లు కరుణించలేదు. మొదటినుంచి ధోనీ వర్గం అన్న ముద్ర పడడం రైనాకు ప్రతికూలంగా మారిందన్న వాదనలు కూడా ఉన్నాయి.

33 ఏళ్ల రైనా తన కెరీర్ లో 13 టెస్టులాడి 768 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 226 మ్యాచ్ లు ఆడి 35 సగటుతో 5,615 పరుగులు సాధించాడు. వన్డేల్లో రైనా పేరిట 5 శతకాలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్ పోటీల్లో 78 మ్యాచ్ లు ఆడిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 134 స్ట్రయిక్ రేట్ తో 1605 రన్స్ నమోదు చేశాడు. టీ20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ వేసే రైనా బౌలింగ్ లోనూ కొన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 13, వన్డేల్లో 36, టీ20 అంతర్జాతీయ పోటీల్లో 13 వికెట్లు పడగొట్టాడు.


More Telugu News