నారా లోకేశ్ మానభంగం చేశారని మేము ఆరోపిస్తే ఊరుకుంటారా?: సుచరిత

  • వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మోదీకి చంద్రబాబు లేఖ
  • ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర అన్న సుచరిత
  • జగన్ కు పేరు రావడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె అన్నారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పారు. నారా లోకేశ్ మానభంగం చేశారని తాము ఆరోపిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై బురద చల్లడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాదరణ పెరగకుండా చేస్తున్న కుట్రల్లో ఇది భాగమని అన్నారు.

చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే నైజమని సుచరిత వ్యాఖ్యానించారు. గతంలో మోదీపై వ్యక్తిగత విమర్శలు గుప్పించిన చంద్రబాబు... ఇప్పుడు మోదీని కీర్తిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలను ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారని... ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తొలుత పత్రికల్లో వార్తను రాస్తారని... ఆ తర్వాత ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తారని మండిపడ్డారు.

దేశంలోనే అత్యుత్తమ మూడో ముఖ్యమంత్రి అని జగన్ కు పేరు రావడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని సుచరిత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీలాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. తమకు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే డీజీపీకి ఇవ్వాలని... లేనిపక్షంలో ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.


More Telugu News