భీమవరంలోని తన కార్యాలయం పేరును మార్చేసిన రఘురామకృష్ణరాజు
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తొలగింపు
- యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా మార్పు
- ఫ్లెక్సీపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోల తొలగింపు
పలువురు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉన్న తన కార్యాలయం పేరును మార్పించారు. ఇప్పటి వరకు ఉన్న 'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' అనే పేరును తొలగించి 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అని మార్చారు. అంతే కాదు ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలో ఉన్న విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను తొలగించారు. అయితే ఈ అంశంపై రఘురాజు ఇంతవరకు స్పందించలేదు.
అయితే ఈ ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీలపై మండిపడ్డారు. పార్లమెంటు లోపల, బయట న్యాయ వ్యవస్థపై దాడికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని ఎద్దేవా చేశారు.