బాపు బొమ్మ గీసిన బ్రహ్మానందం... గాంధీ జయంతి స్పెషల్!

  • చిత్రకళకు పదునుపెడుతున్న బ్రహ్మానందం
  • పెన్సిల్ ఆర్ట్ లో రాణిస్తున్న వైనం
  • తాజాగా గాంధీ బొమ్మ వేసిన బ్రహ్మీ
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మంచి చిత్రకారుడు అన్న సంగతి తెలిసిందే. నవ్వించడమే కాదు, తన బొమ్మలతో ఆశ్చర్యపరచడం కూడా ఆయనకు తెలుసు. తాజాగా, గాంధీ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మానందం తనలోని కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని గీశారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

గతంలో కాలేజి లెక్చరర్ గా పనిచేసిన బ్రహ్మానందంలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఆయన సాహితీప్రియుడు. ఇటీవలే లాక్ డౌన్ రోజుల్లో ఆయన మహాకవి శ్రీశ్రీ చిత్రాన్ని కూడా పెన్సిల్ ఆర్ట్ ద్వారా గీశారు. ఆయన గతంలో మదర్ థెరెస్సా, రాముడు-హనుమ వంటి చిత్రాలతో అలరించారు. కాగా, ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ, తన సోదరుల్లో చిత్రకారులు కూడా ఉన్నారని వెల్లడించారు. వాళ్ల ప్రభావం తనపై ఉండేదని, అందుకే బాల్యంలోనే డ్రాయింగ్ అంటే ఆసక్తి ఏర్పడిందని తెలిపారు.

ఆరో తరగతిలో జోసెఫ్ అనే డ్రాయింగ్ మాస్టారు తనలో చిత్రలేఖనం పట్ల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారని వివరించారు. స్కూల్లో డ్రాయింగ్ పోటీలు పెడితే అందులో ప్రథమ బహుమతి తనకే వచ్చేదని మురిసిపోతూ చెప్పారు. ఎంఏ చదువుతున్నప్పుడు కూడా బొమ్మలు వేయడం ఆపలేదని, అయితే బొమ్మలు వేసుకుంటూ ఎలా బతుకుతావురా అని జాలి చూపించేవారని బ్రహ్మానందం ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.


More Telugu News