ఉపాధి హామీ కార్డులపై దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... మధ్యప్రదేశ్ లో దోపిడీ దందా

  • నకిలీ కార్డులతో నగదు డ్రా చేస్తున్న పంచాయతీ పెద్దలు
  • నిజమైన లబ్దిదారులకు అందని నగదు
  • సర్పంచ్, కార్యదర్శిపై విచారణ షురూ 
మధ్యప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం నేపథ్యంలో దోపిడీ దందా సాగుతోంది. జిర్నియా జిల్లాలో పిపర్ ఖేడా నాకా పంచాయతీలో ఉపాధి హామీ పథకం పేరిట నకిలీ జాబ్ కార్డులు జారీ చేసి, అందిన కాడికి దోచుకుంటున్న వైనం బట్టబయలైంది.

కొన్ని జాబ్ కార్డులపై బాలీవుడ్ అందాలభామలు దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల ఫొటోలు ఉన్నాయి.  జాబ్ కార్డుపై మోనూ దూబే అనే వ్యక్తి పేరు ఉన్నా దానిపై దీపికా పదుకొనే ఫొటో ముద్రించారు. మరో కార్డుపై సోనూ అనే వ్యక్తి పేరు ఉండగా, దానిపై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫొటో దర్శనమిస్తోంది.

కాగా, మోనూ దూబే ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏనాడూ పనికి వెళ్లకపోయినా, అతని పేరిట ఉన్న కార్డు ద్వారా రూ.30 వేలు నొక్కేశారు. ఇలాగే అనేక నకిలీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడుతున్న సర్పంచ్, కార్యదర్శిపై విచారణ షురూ అయింది. సర్పంచ్, కార్యదర్శికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తోడై ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తేలింది. నిజమైన లబ్దిదారులకు అందాల్సిన సొమ్ము అందని నేపథ్యంలో వీరి నిర్వాకం బట్టబయలైంది.


More Telugu News