ఎస్సీ, ఎస్టీలు ఇండస్ట్రియలిస్టులుగా ఎదిగే సమయం వచ్చింది: సీఎం జగన్

  • జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం ప్రారంభం
  • పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపు 
  • బీసీ, అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకుంటామని వెల్లడి
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రకటించింది. ఈ జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం 2020-23 కార్యాచరణను సీఎం జగన్ ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు తనకివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగానే మిగిలిపోయే రోజులు పోయాయని, వారు కూడా ఇండస్ట్రియలిస్టులుగా ఎదిగే సమయం వచ్చిందని అన్నారు.

ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూములు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం స్టాంప్ డ్యూటీ రాయితీ, ఎస్జీఎస్టీ రాయితీ, పేటెంట్ రుసుముల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్ తదితర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.

బీసీ, అగ్రవర్ణ పేదలను కూడా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. వారి జీవితాలను మార్చాలన్న ఉద్దేశంతోనే నవరత్నాలు సహా అనేక పథకాలు తీసుకువచ్చామని తెలిపారు.


More Telugu News