దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల్లో లేటెస్ట్ ట్రెండ్స్!

  • మధ్యప్రదేశ్ లో బీజేపీ సత్తా
  • సాధారణ మెజారిటీ సాధించనున్న శివారాజ్ సింగ్ చౌహాన్
  • ఒడిశాలో బీజేడీ, గుజరాత్ లో బీజేపీ హవా
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కీలక దశకు చేరుకుంది. తొలి మూడు గంటల వ్యవధిలో దాదాపు అన్ని స్ఢానాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ జరుగగా, బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. ఈ 28 సీట్లలో 25 కాంగ్రెస్ వే కావడం గమనార్హం. కాంగ్రెస్ నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చగా ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సాధారణ మెజారిటీని చేరుకుంటుందని అంచనా.

ఇక, గుజరాత్ లో ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, ఏడు చోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఒడిశాలో రెండు చోట్ల ఎన్నికలు జరుగగా, రెండింటా బిజూ జనతాదళ్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్ లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగగా, ఒక చోట ఇప్పటికే విజయం సాధించిన బీజేపీ మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు మిగతా చోట్ల ముందంజలో ఉన్నారు.

ఇక ఉత్తర ప్రదేశ్ విషయానికి వస్తే, 7 చోట్ల ఎన్నికలు జరుగగా, ఐదు చోట్ల బీజేపీ, రెండు చోట్ల సమాజ్ వాదీ ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఒకే ఒక్క ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ రెండింటా ఆధిక్యంలో ఉంది. తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గపు ఉప ఎన్నికలో ఐదు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,020 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


More Telugu News