ఐపీఎల్ 2020లో పరమచెత్త ఐదుగురు ఆటగాళ్లు వీళ్లే: వీరేంద్ర సెహ్వాగ్

  • ఇటీవల ముగిసిన ఐపీఎల్
  • రాణించని స్టార్ ఆటగాళ్లు
  • టాప్-5 చెత్త ఆటగాళ్ల జాబితా రూపొందించిన వీరూ
ఐపీఎల్ 2020 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఆటగాళ్లు అంచనాలకు తగిన విధంగా రాణించలేక అప్రదిష్ఠ మూటగట్టుకున్నారు. అలాంటివారిలో టాప్-5 వీళ్లేనంటూ భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ జాబితా వెల్లడించాడు. వారిలో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాగా, ఒకరు వెస్టిండీస్, మరొకరు దక్షిణాఫ్రికాకు చెందినవారు. సెహ్వాగ్ వెల్లడించిన పరమచెత్త ఆటగాళ్ల టాప్-5లో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), గ్లెన్ మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.

ఒకప్పుడు తన పేస్ తో అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ ను వణికిస్తూ 'స్టెయిన్' గన్ గా పేరుగాంచిన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ పై సెహ్వాగ్ జోకేశాడు. 'స్టెయిన్' గన్ కాస్తా 'భారత దేశవాళీ గొట్టం తుపాకీ'లా తయారైందని చమత్కరించాడు. ఒకప్పుడు గొప్పగా వెలిగిన స్టెయిన్ ను ఇప్పుడందరూ ఉతికారేస్తుండడం జీర్ణించుకోలేని విషయం అన్నాడు.

ఇక, టాప్-5 చెత్త ఆటగాళ్లలో మిగిలినవాళ్ల విషయానికొస్తే... ఆస్ట్రేలియా జట్టుకు ఆడేటప్పుడు రెచ్చిపోయి ఆడే ఆరోన్ ఫించ్ ఈ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. అయితే 12 మ్యాచ్ లు ఆడి కేవలం 268 పరుగులు చేసి నిరాశపరిచాడు. అతడి సగటు 22.33 మాత్రమే.

విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ దీ అదే పరిస్థితి. విధ్వంసకర షాట్లకు మారుపేరుగా నిలిచే ఈ భారీకాయుడు కోల్ కతా జట్టుకు ఆడుతూ 10 మ్యాచ్ ల్లో 117 పరగులు చేశాడు. ఓ దశలో ఫిట్ నెస్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు.

ఇక, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో తప్పుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ది సైతం ఓ నిరాశజనక గాథ. చెన్నై సూపర్ కింగ్స్ గత విజయాల్లో కీలకపాత్ర పోషించిన వాట్సన్ ఈసారి ఆ స్థాయి ఆటతీరు కనబర్చడంలో విఫలమయ్యాడు. 11 మ్యాచ్ ల్లో 29.90 సగటుతో 299 రన్స్ చేశాడు.

ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ ఐపీఎల్ ను ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. అతి పెద్ద ఫ్లాప్ షో అంటే మ్యాక్స్ వెల్ దే. ఈ కంగారూ ఆటగాడు ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ఆడుతూ 13 మ్యాచ్ ల్లో 108 పరుగులు చేశాడు. సగటు 15.42 మాత్రమే. విఫలమవుతున్నా అతడికి అన్ని మ్యాచ్ ల్లో అవకాశం ఇచ్చారంటే గొప్ప విషయమే. మ్యాక్స్ వెల్ ను ఎదురు డబ్బులిచ్చి విహారయాత్రకు తీసుకొచ్చినట్టుందని సెహ్వాగ్ వ్యంగ్యం ప్రదర్శించాడు.


More Telugu News