ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

  • జనవరి 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
  •  థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటు అయ్యేలా ఫాస్టాగ్
  • జనవరికి వాయిదా పడిన ఈటీసీ అమలు
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వాహన కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. దీంతో డిసెంబరు 2017కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందేనని, 1 ఏప్రిల్ 2021 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిజానికి ఈ ఏడాది డిసెంబరు నుంచే దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ)ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, కరోనా కారణంగా అది వాయిదా పడింది.

కేంద్రం ఆదేశాలతో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని ఏపీ రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర పరిధిలో జాతీయ రహదారులపై 42 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 75 శాతం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయగా, 25 శాతం డబ్బులు చెల్లించే లైన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని కూడా ఫాస్టాగ్ లైన్లుగా మార్చాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. అలాగే, రాష్ట్ర రహదారులపై ఉన్న 16 టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు ఖర్చు చేసే దాంట్లో కేంద్రం 70 శాతం భరిస్తుందని కేంద్రం గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఫాస్టాగ్ లైన్లుగా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


More Telugu News