శరద్ పవార్ కు యూపీఏ పగ్గాలు అనే వార్తలపై ఎన్సీపీ స్పందన

  • ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు
  • తమకు ప్రతిపాదనలు కూడా రాలేదు
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోంది. దీంతో, యూపీఏ సైతం పతనావస్థకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో యూపీఏకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెసేతర నాయకులకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే బాగుంటుందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. దీంతో, యూపీఏ ఛైర్మన్ పదవిని శరద్ పవార్ చేపట్టబోతున్నారనే వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై ఎన్సీపీ నేత మహేశ్ తపసీ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా తమకు ఎలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని అన్నారు. యూపీఏలో ఉన్న మిత్రులతో చర్చలు కూడా జరగలేదని చెప్పారు. రైతులు చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నాయని అన్నారు.


More Telugu News