ప్రకాశం జిల్లాలో దారుణం.. శ్రీకృష్ణ ఆలయంలో రక్తం, మాంసం చల్లిన దుండగులు!

  • దర్శిలోని పడమటి బజారులోని ఆలయంలో దారుణం
  • ఆలయంలోని గోడలకు కూడా రక్తపు ముద్రలు వేసిన దుండగులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పడమటి బజారులో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో గుర్తు  తెలియని దుండగులు మాంసపు ముక్కలను వెదజల్లి, రక్తాన్ని చల్లి వెళ్లారు. ఆలయంలోని గోడలకు  కూడా రక్తంతో ముద్రలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన శిలా ఫలకానికి కూడా రక్తాన్ని పూశారు.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికంగా కలకలం రేగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. జరిగిన ఘటనపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే దర్శిలో ఇలాంటి ఘటన జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


More Telugu News