సాగు చట్టాలు రైతులకు మేలు చేయవు.. వారిని నాశనం చేస్తాయి: రాహుల్​ గాంధీ మండిపాటు

  • రైతులపై బీజేపీ వ్యవసాయ చట్టాలతో దాడి
  • చట్టాలు రద్దు చేసేదాకా కాంగ్రెస్ పోరాటం
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు
సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వాటిని రద్దు చేసేదాకా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని, రైతులను నాశనం చేసేవని మండిపడ్డారు.

శుక్రవారం రాహుల్, ప్రియాంకగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటిని ముట్టడించి ధర్నాకు దిగారు. రైతుల ఆందోళన సందర్భంగా రైతు హక్కుల దినాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా రైతు హక్కులపై గొంతెత్తండంటూ ప్రచారం చేస్తోంది.

ఇంతకుముందు భూ సేకరణ చట్టం ద్వారా రైతుల భూములను లాక్కునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అది జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని రాహుల్ అన్నారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ, ఆ పార్టీ ఇద్దరుముగ్గురు మిత్రులు మూడు వ్యవసాయ చట్టాలతో రైతులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.

కాగా, అంతకుముందు అహంకారపూరిత మోదీ ప్రభుత్వంపై రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారంటూ ట్వీట్ చేశారు. రైతులపై జరుగుతున్న అకృత్యాలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఈరోజు దేశమంతా గళమెత్తుతోందని అన్నారు. రైతుల సత్యాగ్రహానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.


More Telugu News