ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తన పని తాను చేసుకుపోతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం!

  • మొత్తం ఓటర్ల సంఖ్య 4,04,41,378
  • మహిళా ఓటర్లు 2,04,71,506 మంది
  • పురుష ఓటర్లు 1,99,66,737 మంది
పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? లేదా?... ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో ఎన్నికల నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల ప్రక్రియ కరోనా వ్యాక్సినేషన్ కు అడ్డొస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

దీంతో ఎన్నికల సంఘం ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. అయితే, దీనిపై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ, హైకోర్టు ఈ నెల 18కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఓటరు జాబితాను ప్రకటించింది.

2021 జనవరి 15 నాటికి రాష్ట్రంలో 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 2,04,71,506 మంది మహిళా ఓటర్లు కాగా... 1,99,66,737 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 4,135 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని చెప్పింది.


More Telugu News