ఏపీలో బీజేపీని ఎదగకుండా చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు: వల్లభనేని వంశీ

  • వచ్చే ఎన్నికలలో హిందూ ఓట్లతో గెలవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు
  • ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్నారు
  • కరోనా వ్యాక్సినేషన్ సమయంలో పంచాయతీ ఎన్నికలు అనవసరం
టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సరికొత్త ఆరోపణలు గుప్పించారు. ఏపీలో బీజేపీ బలపడకుండా ఉండేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని... అందుకే ఆయన హిందుత్వ కార్డును ఎత్తుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో హిందూ ఓట్లతో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. బీజేపీకి భయపడే చంద్రబాబు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు.

అయినా, రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీలను నమ్మే పరిస్థితిలో లేరని వంశీ చెప్పారు. స్వలాభం కోసమే చంద్రబాబు అప్పుడప్పుడు రాజ్యాంగం ప్రస్తావన తీసుకొస్తుంటారని... మరి, ఏ రాజ్యాంగం ప్రకారం కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఎన్నికలంటే భయమని... అందుకే తెలంగాణలోని దుబ్బాకలో పోటీ చేయలేదని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం కూడా చేయలేదని అన్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో హడావుడిగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికలు ఒక నెల ఆలస్యమైతే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.


More Telugu News