కోర్టు హెచ్చరిక నేపథ్యంలో ఓటుకు నోటు కేసు విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

  • ఓటుకు నోటు కేసులో నిందితుడిగా రేవంత్ రెడ్డి
  • గతంలో కోర్టులో హాజరుకాని వైనం
  • వారెంట్ జారీ చేస్తామన్న ఏసీబీ న్యాయస్థానం
  • కోర్టుకు వచ్చిన నిందితులు
  • ఫిబ్రవరి 16కి విచారణ వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహా నిందితులన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్నటి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో రేవంత్ రెడ్డిపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు రాకపోతే వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరయ్యారు. రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయసింహా కూడా కోర్టుకు వచ్చారు.

ఇది ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని, ఇది ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలుకు వారం గడువు ఇవ్వాలని, అప్పటివరకు అభియోగాల నమోదు ప్రక్రియ నిలుపుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

రేవంత్ న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఆపై మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయి విచారణ ఉంటుందని, న్యాయవాదులు వాదనలను సిద్ధం చేసుకోవాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటు, ఫిబ్రవరి 16న జరిగే విచారణకు నిందితులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.


More Telugu News