ఎర్రకోట వద్ద కత్తులు తిప్పిన ‘మోస్ట్​ వాంటెడ్​’ నిందితుడి అరెస్ట్​

  • ఢిల్లీ పిటంపురా బస్ స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అతడి ఇంట్లో నుంచి రెండు ఖడ్గాలు స్వాధీనం
  • పక్కా ప్లాన్ ప్రకారమే ఎర్రకోట వద్దకు వెళ్లామన్న నిందితుడు
  • ట్రాక్టర్ ర్యాలీ కోసం మరో ఐదుగురిని కూడదీశానని వెల్లడి
గణతంత్ర దినోత్సవ ట్రాక్టర్ ర్యాలీ హింసలో ఎర్రకోట వద్ద కత్తి తిప్పిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట వద్ద మణీందర్ సింగ్ అలియాస్ మోని (30) కత్తి తిప్పిన వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు అతడిని ‘మోస్ట్ వాంటెడ్’గా ప్రకటించారు.

ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న అతడిని పిటంపురా బస్ స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వరూప్ నగర్ లోని అతడి ఇంట్లో నుంచి రెండు ఖడ్గాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.  

మణీందర్ ఏం చెప్పాడు?

రైతులు ఆందోళన చేస్తున్న సింఘూ సరిహద్దులకు తాను రోజూ వెళ్లేవాడినని మణీందర్ చెప్పాడు. రైతు నేతల ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానన్నాడు. ట్రాక్టర్ ర్యాలీ కోసం తన ఇంటికి పొరుగున ఉండో మరో ఐదుగురినీ కూడదీశానని, ఆ సమయంలో రెండు ఖడ్గాలను వెంట తెచ్చుకున్నానని వెల్లడించాడు.

వారితో కలిసి సింఘూ సరిహద్దుల నుంచి ముకార్బా చౌక్ వరకు బైకులపై తమ టీమ్ అనుసరించిందని తెలిపాడు. పక్కా ప్లాన్ ప్రకారమే ఎర్రకోట వద్దకు చేరుకున్నట్టు వివరించాడు. కాగా, నిందితుడి ఫోన్ లోనూ అతడు ఖడ్గం తిప్పిన వీడియో ఉందని పోలీసులు అంటున్నారు. అంతేగాకుండా, తన ఇంటి వద్ద పలువురికి కత్తిసాము నేర్పిస్తున్నాడని తెలిపారు.


More Telugu News