బూత్ ఏజెంట్‌గా పనిచేసిన యువకుడి ఆత్మహత్య.. వైసీపీ నేత బెదిరింపుల వల్లేనంటూ సూసైడ్ నోట్!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • వైసీపీ నేతల రిగ్గింగును అడ్డుకోబోయిన రవిశంకర్
  • చంపేస్తామని బెదిరింపులు
  • తన ఆత్మహత్యకు వారే కారణమంటూ లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు బూత్ ఏజెంట్‌గా పనిచేసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం రూరల్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నడిపూడి గ్రామంలోని మెట్టరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా 11వ వార్డుకు ఓ పార్టీ తరపున బూత్ ఏజెంట్‌గా పనిచేశాడు.

పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు కొందరు రిగ్గింగుకు పాల్పడ్డారని, అడ్డుకోబోయిన తనను చంపేస్తామని బెదిరించారని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లేఖలో రవిశంకర్ ఆరోపించారు. ఆ తర్వాత కూడా వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు.

తన ఆత్మహత్యకు వారే కారణమన్నాడు. రవి తల్లిదండ్రులు కూడా కుమారుడి ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.


More Telugu News