నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

  • టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 1.36 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది
  • ఇవ్వలేదని నిరూపిస్తే రాజకీయాాల నుంచి తప్పుకుంటా
  • సమాచార హక్కు చట్టం కింద వివరాలను తెలుసుకోవచ్చు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1.36 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని... దీనికి సంబంధించి పూర్తి లెక్కలు ఉన్నాయని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. తాము చెప్పినన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ఏయే శాఖలలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశామనే విషయాన్ని పక్కా లెక్కలతో ప్రభుత్వం వెల్లడించిందని... సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. ఈరోజు బేగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో సనత్ నగర్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేకే, మంత్రి తలసానితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని గెలిపించాలని కేకే కోరారు. వాణీదేవి గొప్ప విద్యావేత్త అని... జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆమెకు అవగాహన ఉందని కితాబిచ్చారు. ఆమెను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. ఆమెను గెలిపిస్తే పీవీ కుటుంబానికి గౌరవమిచ్చినవారం అవుతామని తెలిపారు.


More Telugu News