లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు బీజేపీ కారణంగానే పోయాయి: ఉత్తమ్ కుమార్

  • గాంధీభవన్ లో టీపీసీసీ అనుబంధ సంఘాల భేటీ
  • బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదన్న ఉత్తమ్ కుమార్
  • పైగా నష్టమే ఎక్కువ జరిగిందని వెల్లడి
  • బీజేపీ తెలంగాణలో ఓ నీటి బుడగ వంటిదని వ్యాఖ్యలు
  • స్వార్థపరులే కాంగ్రెస్ ను వీడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీపై ధ్వజమెత్తారు. ఏడేళ్ల పాలనలో దేశానికి బీజేపీ చేసింది ఏమీలేదని, ప్రత్యేకించి బీజేపీ వల్ల తెలంగాణకు లబ్ది చేకూరకపోగా భారీ నష్టం జరిగిందని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన ఐటీఐఆర్ ను కేంద్రం రద్దు చేసిందని, దాంతో లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. అందుకు కారణం బీజేపీయేనని అన్నారు. చమురు ధరలు నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీజేపీకి ఎలాంటి బలం లేదని, బీజేపీ ఓ నీటి బుడగ వంటిదని అభివర్ణించారు. అదేసమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలంగా ఉందని ఉద్ఘాటించారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళుతున్నారని, ఇది దుర్మార్గం అని మండిపడ్డారు.


More Telugu News