మమత పార్టీలోకి బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా

  • ఎన్నికలకు ముందు తృణమూల్ పార్టీలోకి
  • దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కామెంట్
  • మోదీది అణచివేత ధోరణి అని మండిపాటు
  • ప్రభుత్వ తప్పులను ఎవరూ ఆపలేకపోతున్నారని విమర్శ
యశ్వంత్ సిన్హా.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓ సీనియర్ నేత. అలాంటి నేత ఇప్పుడు తృణమూల్ పార్టీ కండువా కప్పుకొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభానికి కొన్ని రోజుల ముందు శనివారం ఆయన ఆ పార్టీలో చేరారు. డెరెక్ ఓ బ్రయన్, సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీల సమక్షంలో కోల్ కతాలోని తృణమూల్ భవన్ లో ఆ పార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ చీఫ్ మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసి, ఆమెను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత శక్తిమంతంగా ఉంటుందన్నారు. కానీ, ఇప్పుడు న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరూ ఆపలేకపోతున్నారని విమర్శించారు.

వాజ్ పేయి హయాంలో బీజేపీ అందరి అభిప్రాయాలను తీసుకునేదని, కానీ, మోదీ హయాంలో అణచి వేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీయే నుంచి అకాలీ దళ్, బీజేడీ వంటి పార్టీలు బయటకొచ్చేశాయన్నారు. అణచివేస్తుంటే ఎవరు మాత్రం ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా ఉండట్లేదని విమర్శించారు. కాగా, నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీ నుంచి బయటకొచ్చేశారు.


More Telugu News