ఇంగ్లండ్ తో ఆఖరి వన్డేలో భారత్ 329 ఆలౌట్

  • పుణే వేదికగా భారత్-ఇంగ్లండ్ ఆఖరి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 48.2 ఓవర్లకు వికెట్లన్నీ కోల్పోయిన టీమిండియా
  • ధావన్, పంత్, పాండ్య అర్ధసెంచరీలు
  • మార్క్ ఉడ్ కు 3 వికెట్లు
సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులు చేసింది. 48.2 ఓవర్లకే వికెట్లన్నీ కోల్పోయింది. ఓ దశలో టీమిండియా దూకుడు చూస్తే 400 పరుగుల స్కోరు సాధ్యమేనని అనిపించింది. కానీ, కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్లు ఆతిథ్య జట్టు జోరుకు బ్రేకులు వేశారు.

పుణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. శిఖర్ ధావన్ (56 బంతుల్లో 10 ఫోర్లతో 67 రన్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 37) తొలి వికెట్ కు 103 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (7), కేఎల్ రాహుల్ (7) విఫలమైనా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య జోడీ క్రీజులో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించింది. పంత్ 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులు చేయగా, పాండ్య 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు సాధించాడు.

ఆ తర్వాత కృనాల్ పాండ్య (25), శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 రన్స్) పోరాడడంతో భారత్ స్కోరు 300 మార్కు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3, అదిల్ రషీద్ 2, శామ్ కరన్ 1, రీస్ టాప్లే 1, మొయిన్ అలీ 1, లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు.


More Telugu News