టీమిండియా తదుపరి కెప్టెన్ రిషబ్ పంత్ కావచ్చు: అజారుద్దీన్

  • ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా పంత్
  • పంత్ దూకుడు జట్టుకు లాభిస్తుంది
  • సెలక్టర్ల దృష్టిలో ముందుంటాడన్న అజారుద్దీన్
విరాట్ కోహ్లీ తరువాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు. మరో వారంలో మొదలయ్యే ఐపీఎల్ 14వ సీజన్ కు ఢిల్లీ కాపిటల్స్ జట్టు సారధిగా పంత్ పేరును ప్రకటించడంపై అజార్ స్పందించారు. యువ ఆటగాడిగా, వికెట్ కీపర్ గా జట్టులో పంత్ అత్యంత కీలక ఆటగాడని కితాబునిచ్చారు. పంత్ సారధిగా కూడా రాణిస్తాడన్న నమ్మకం ఉందని అన్నారు.

ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన అజారుద్దీన్, పంత్ గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడని ప్రశంసించారు. సమీప భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ రేసులో అతని పేరు సెలక్టర్ల దృష్టిలో మిగతా వారితో పోలిస్తే ముందున్నా తాను ఆశ్చర్యపోనని అన్నారు. పంత్ దూకుడైన ఆటతీరు ఇండియాను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని అన్నారు.

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ ను ప్రకటించడంపై రికీ పాంటింగ్, శ్రేయాస్ అయ్యర్, సురేశ్ రైనా వంటి వారు హర్షం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని పంత్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలని ఉందని జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. ఈ కొత్త బాధ్యతల్లో పంత్ రాణిస్తాడన్న నమ్మకం తనకుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు.


More Telugu News