తల్లి అనుమానాస్పద మరణం.. రెండు రోజులు పస్తులున్న 18 నెలల చిన్నారి!

  • కరోనా నేపథ్యంలో హృదయవిదారక ఘటనలు
  • కొవిడ్‌తో మహిళ మరణించిందని అనుమానం
  • పసి బాబునూ చేరదీసేందుకు వెనుకాడిన స్థానికులు
  • రెండు రోజుల తర్వాత పోలీసుల దృష్టికి
  • బాబును చేరదీసిన మహిళా కానిస్టేబుళ్లు
కరోనా నేపథ్యంలో రోజుకో హృదయవిదారక ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా మహారాష్ట్రలో హృదయాల్ని కలిచివేసే సంఘటన తెరపైకి వచ్చింది. 18 నెలల బాబు గల ఓ మహిళ ఇంట్లోనే అనుమానాస్పదంగా తనువు చాలించింది. అయితే, ఆమె కొవిడ్‌తో మరణించి ఉంటుందన్న అనుమానంతో రెండు రోజుల పాటు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించే సాహసం చేయలేదు. దీంతో ఆ చిన్నారి రెండు రోజుల పాటు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుణెలోని పింప్రి చించ్వాడ్‌ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

చివరకు ఇంటి యజమాని పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టుకొని లోపలికి వెళ్లారు. మహిళ మృతదేహంతో పాటు పక్కనే బాబు ఉన్నాడు. శనివారమే ఆమె మరణించి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి బాబు ఆకలితోనే ఉన్నట్లు గుర్తించారు.

చుట్టుపక్కల వారు బాబును తీసుకోవడానికి వెనుకాడినప్పటికీ.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం చిన్నారిని చేతుల్లోకి తీసుకొని పాలు పట్టారు. ‘‘నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబును చూడగానే నా సొంత పిల్లాడిలానే అనిపించాడు. పట్టిన కొద్దిసేపట్లోనే పాలన్నీ తాగేశాడు’’ అని సుశీలా గభాలే అనే కానిస్టేబుల్‌ తెలిపారు.

బాబుకు స్వల్ప జ్వరం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదని మరో కానిస్టేబుల్‌ రేఖా వాజే తెలిపారు. సరైన ఆహారం అందిస్తే వెంటనే కోలుకుంటాడని వైద్యులు చెప్పారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా.. నెగెటివ్‌ అని తేలిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు.

ఇదిలా ఉంటే, మహిళ శవపరీక్ష నివేదిక రావాల్సి ఉంది. ఆమె మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఇక ఆమె భర్త ఉపాధి నిమిత్తం ఉత్తర్ప్రదేశ్‌ వెళ్లాడు. ఆయన ఇంకా రావాల్సి ఉందని ఎస్‌ఐ ప్రకాశ్‌ జాదవ్‌ తెలిపారు.


More Telugu News