బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి.. పాక్షిక లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు బంద్‌
  • సినిమా థియేటర్లు, క్రీడా ప్రాంగణాలు మూసివేత
  • మార్కెట్లు ఐదు గంటలు తెరిచి ఉంచాలి
  • అత్యవసర సేవలకు మినహాయింపు
  • మే 2న కౌంటింగ్ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, రెస్టారెంట్లు, బార్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేస్తున్నట్లు తెలిపింది. మార్కెట్లు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య అంటే మొత్తం 5 గంటల పాటు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది.

హోం డెలివరీ, ఆన్‌లైన్‌ సేవలను మాత్రం అనుమతించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సంబంధమైన సమావేశాలను నిషేధించింది. ఔషధ దుకాణాలు, వైద్య సంబంధిత పరికరాలు, నిత్యావసర సరకుల అమ్మకాలకు మినహాయింపు ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 2న కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. గురువారం ఒక్కరోజే బెంగాల్‌ వ్యాప్తంగా 17,403 కొత్త కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి.


More Telugu News