పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి: జనసేన

  • విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది
  • విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనలోకి నెడుతున్నారు
  • పరీక్షలు రద్దు చేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం
  • జనసేన పార్టీ వీర మహిళా విభాగం నిరసన దీక్షలు
  • ప్రకటన విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి
ఓవైపు కరోనా విజృంభిస్తుండగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలన్న తన మొండి వైఖరితో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి  ఆందోళనలోకి నెట్టారని ఆరోపిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్టీ వీర మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా నేతలు పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఇళ్లలోనే దీక్షలు చేశారని తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం యథాతధంగా పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరమని పార్టీ మహిళా నేతలు అభిప్రాయపడ్డారు. సీబీఎస్‌ఈతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచించి పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన మహిళా నేతలు విమర్శించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేని ప్రభుత్వం.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంలో మాత్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఇది సీఎం జగన్‌ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ దీక్షలకు మద్దతుగా హైదరాబాద్‌లో తెలంగాణ వీర మహిళా విభాగం నేతలు ఇళ్లల్లోనే దీక్షలు చేశారు.


More Telugu News