తమను నియంత్రించడాన్ని కొందరు భారత సీనియర్ ఆటగాళ్లు భరించలేరు: ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్

  • బబుల్ ఉన్నంతసేపు సురక్షితంగానే ఉన్నాం
  • కరోనా సోకడం ప్రారంభమైనప్పటి నుంచి భయం ప్రారంభమైంది
  • అహ్మదాబాద్ లో టెస్ట్ మ్యాచ్ నిర్వహించడం బాధ్యతారాహిత్యం
భారత సీనియర్ క్రికెటర్లపై ముంబై ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పమ్మెంట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారిని నియంత్రించడం కానీ, వారికి ఏదైనా చెప్పడం కానీ చేస్తే భరించలేరని అన్నాడు. అయితే ఆ సీనియర్ ప్లేయర్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

 ఐపీఎల్ ఆడుతున్నంత సేపు బయోబబుల్ లో తామంతా సురక్షితంగానే ఉన్నామని... అయితే ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం కంగారుగా ఉండేదని చెప్పాడు. వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడం ప్రారంభమైనప్పటి నుంచి భయం పెరిగిందని తెలిపాడు.

కరోనా కేసులు వచ్చినట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రకటించిన తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మైండ్ సెట్ మారిపోయిందని జేమ్స్ చెప్పాడు. కుటుంబసభ్యులు కరోనా బారిన పడి ఆందోళనలో వున్న భారత ఆటగాళ్లను తమతో కలుపుకుంటూ వారిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశామని తెలిపాడు.

ఐపీఎల్ ను వివిధ నగరాల్లో నిర్వహించకుండా కేవలం ముంబైలోనే నిర్వహించి ఉంటే బాగుండేదని జేమ్స్ చెప్పాడు. తాము తొలిసారి చెన్నైకి వెళ్లినప్పుడు తొలి కరోనా కేసు వచ్చిందని... తమ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు కరోనా బారిన పడ్డాడని తెలిపారు. వెంటనే అతన్ని ఐసొలేషన్ కు తరలించారని... అతనితో కాంటాక్ట్ లోకి వచ్చిన ఎవరూ వైరస్ కు గురి కాలేదని చెప్పాడు. బయోబబుల్ అనేది ఛేదించలేనిదేమీ కాదని... అంతకు మించిన చర్యలను తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టుకు 70 వేల మంది ప్రేక్షకులను అనుమతించడం సరైన నిర్ణయం కాదని జేమ్స్ చెప్పాడు. అహ్మదాబాద్ లో కరోనా విపరీతంగా ఉన్న తరుణంలో మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం కొంత బాధ్యతారాహిత్యమేనని అన్నాడు.


More Telugu News