కరోనా నివారణకు డీఎన్ఏ ఆధారిత టీకా అభివృద్ధి చేసిన తైవాన్ పరిశోధకులు

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఎంఆర్ఎన్ఏ విధానం
  • డీఎన్ఏతో వ్యాక్సిన్ కు రూపకల్పన చేసిన తైవాన్ నిపుణులు
  • ఎలుకలపై నిర్వహించిన ప్రయోగం
  • ఐదు నెలల వరకు నిలకడగా యాంటీబాడీలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఎం-ఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) స్ట్రెయిన్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ వ్యాక్సిన్లు మానవదేహంలోకి ప్రవేశించాక కొవిడ్ వైరస్ ను గుర్తించేలా మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ప్రేరేపితం చేస్తాయి. అయితే, అందుకు భిన్నంగా తైవాన్ పరిశోధకులు డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.

ప్రస్తుతానికి దీన్ని ఎలుకలపై ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. కరోనా వైరస్ లోని కీలకమైన స్పైక్ ప్రొటీన్ పై దాడి చేసే యాంటీబాడీలు ఎలుకల్లో ఉత్పత్తి అయినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన రెండు నెలల తర్వాత అవి గరిష్ఠ స్థాయికి చేరినట్టు పరిశోధనలో తేలింది. 5 నెలల తర్వాత కూడా యాంటీబాడీల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల లేకపోవడాన్ని గమనించారు.

కాగా, ఈ డీఎన్ఏ టీకాల రవాణాకు కోల్డ్ కంటెయినర్ల అవసరం ఉండదని తైవాన్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో తైవాన్ కు చెందిన జాతీయ ఆరోగ్య పరిశోధన కేంద్రం నిపుణులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ ను గుర్తించేలా తమ డీఎన్ఏ వ్యాక్సిన్ కు రూపకల్పన చేశారు. అయితే, డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లను జీవుల కణాల్లోకి పంపడం కష్టసాధ్యం కావడంతో, తైవాన్ నిపుణులు ఎలక్ట్రోపొరేషన్ ప్రక్రియ ద్వారా దాన్ని సుసాధ్యం చేశారు.


More Telugu News