టీడీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నాం: అంబటి

  • అంబటి ప్రెస్ మీట్
  • చంద్రబాబు హయాంలో ఇష్టారాజ్యంగా లీజుకిచ్చారని వెల్లడి
  • లీజు ముగిసినా తిష్టవేశారని ఆరోపణలు
  • చర్యలు తీసుకుంటుంటే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం
ఇటీవల విశాఖలో ఓ మానసిక దివ్యాంగుల పాఠశాలను ప్రభుత్వం కూల్చివేసిందంటూ తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. కొన్నిరోజుల కిందట టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూముల అంశంపైనా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చెందిన పాఠశాలను కూడా పడగొట్టేస్తున్నారంటూ తమ ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఎప్పటికీ అలా చెయ్యదని అన్నారు. కానీ, మానసిక దివ్యాంగుల పాఠశాలల పేరిట జరిగే దురాక్రమణలపై మాత్రమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంబటి స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో విశాఖలోని అతి ఖరీదైన భూములను పప్పుబెల్లాల్లా లీజుకు ఇచ్చారని ఆరోపించారు. విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారని, భూ ఆక్రమణలకు పాల్పడిన వారి నుంచే తమ ప్రభుత్వం తిరిగి భూములను స్వాధీనం చేసుకుంటోందని వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములనే తాము స్వాధీనం చేసుకుంటుంటే, మీడియాలోని ఓ వర్గం గగ్గోలు పెడుతోందని విమర్శించారు. లీజులు ముగిసిన తర్వాత కూడా భూముల్లో తిష్ట వేస్తున్నవారిని ఏం చేయాలని అంబటి ప్రశ్నించారు.

నాడు చంద్రబాబు హయాంలో విశాఖలో భూకుంభకోణాలు జరిగితే, కొందరు ప్రజాప్రతినిధుల అండతోనే ఈ దందా నడుస్తోందని అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అనలేదా? అని అంబటి ప్రశ్నించారు. భూ కుంభకోణాలకు పాల్పడేవారిని తన్నడానికి కూడా విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నిజాలే చెబుతానని, అవసరమైతే తాను మంత్రి పదవి వదులుకోవడానికైనా సిద్ధమని చెప్పిన విషయాన్ని అయ్యన్న మర్చిపోయారా? అని నిలదీశారు.

అప్పుడు విశాఖ జిల్లాలో 379 గ్రామాల భూ రికార్డులు గల్లంతయ్యాయని విశాఖ కలెక్టర్ బహిరంగంగా చెప్పారని అంబటి వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా విశాఖలో భూములు ఆక్రమించిన వైనం ఇప్పుడు బట్టబయలవుతోందని, ఇప్పుడు చంద్రబాబు గగ్గోలు పెట్టడంలో అర్థంలేదని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే ప్రభుత్వం అడ్డుకుంటోందని స్పష్టం చేశారు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడ్ని సమర్థించడం ఎంత తప్పో, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టడం కూడా అంతే తప్పు అని అంబటి పేర్కొన్నారు.


More Telugu News