బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన కీలక నేత!

  • తృణమూల్‌లో చేరతానన్న గంగా ప్రసాద్‌
  • అలీద్వార్‌పూర్‌కు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న గంగా ప్రసాద్‌
  • బీజేపీ ఎంపీలు ప్రత్యేక ఉత్తర బెంగాల్‌ను కోరడంపై అసంతృప్తి
  • బెంగాల్‌ను విజభించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • గంగాప్రసాద్‌ మద్దతుతో అన్ని సీట్లు గెలిచిన బీజేపీ
బెంగాల్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరిన నాయకులు మాత్రమే తిరిగి సొంత గూటికి చేరారు. కానీ, తాజాగా కొన్నేళ్లుగా బీజేపీలో ఉండి, అలీపూర్‌ద్వార్‌ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న గంగాప్రసాద్‌ శర్మ తృణమూల్‌లో చేరనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు ఉత్తర బెంగాల్‌ను విభజించి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరడం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంగా ప్రసాద్‌  ప్రకటించారు. బెంగాల్‌ను బీజేపీ ఎంపీలు విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల ఓ ఎంపీ ఇంట్లో రహస్య మంతనాలు జరిపినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఓ ఎంపీ ఉత్తర బెంగాల్‌లో రాజకీయ హింసను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనికి కేంద్ర నాయకత్వ మద్దతు కూడా ఉందన్నారు. ఈ కుట్రను భంగం చేయడానికే తాను తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నానన్నారు. ఉత్తర బెంగాల్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని వ్యాఖ్యానించారు.

గంగా ప్రసాద్‌ శర్మతో పాటు జిల్లాకు చెందిన మరో ఏడుగురు కీలక నేతలు సైతం టీఎంసీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అలీద్వార్‌పూర్‌ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీయే విజయం సాధించింది. గంగా ప్రసాద్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందన్న వాదన ఉంది. అలాగే గత లోక్‌సభ ఎన్నికల్లోనూ గంగా ప్రసాద్ మద్దతు వల్లే జిల్లాలోని ఒక్క ఎంపీ స్థానం సైతం 2.5 లక్షలకు పైగా మెజారిటీతో బీజేపీ వశమైందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో గంగా ప్రసాద్‌ పార్టీని వీడడం బెంగాల్‌లో బీజేపీకి గట్టి దెబ్బ అనే చర్చ జరుగుతోంది.


More Telugu News