బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిపై ప్రకటన చేసిన ప్రత్యేక అధికారి

  • ఓ కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
  • మైదుకూరు ఎమ్మెల్యే చొరవతో సయోధ్య
  • పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి 
  • ఉత్తరాధికారిగా వీరభద్రయ్య
  • తదుపరి పీఠాధిపతిగా గోవిందస్వామి
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. మఠం నూతన పీఠాధిపతిగా దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రిస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన దేవాదాయశాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ ఓ ప్రకటన చేశారు. పీఠాధిపతి పదవి కోసం పోటీ పడిన రెండు కుటుంబాల వారితో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి బాధ్యతలు చేపడతారని చంద్రశేఖర్ ఆజాద్ వివరించారు. కలిసికట్టుగా ఉంటామని రెండు కుటుంబాల వారు లిఖితపూర్వక హామీ ఇచ్చారని చంద్రశేఖర్ ఆజాద్ వెల్లడించారు.

కాగా, మఠం ఉత్తరాధికారిగా వెంకటాద్రిస్వామి సోదరుడు వీరభద్రయ్య నియమితులు కాగా, వెంకటాద్రిస్వామి తదనంతరం పీఠాధిపతిగా మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడు గోవిందస్వామి నియమితుడయ్యేలా ఏకాభిప్రాయానికి వచ్చారు.

గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ విషయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చొరవ చూపిన తర్వాత పురోగతి కనిపించినట్టు తెలుస్తోంది. ఇవాళ మీడియాతో ఆయనే ఈ వివరాలు తెలిపారు. బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి వెంకటాద్రిస్వామిని, ఉత్తరాధికారి వీరభద్రయ్యను, తదనంతర పీఠాధిపతి గోవిందస్వామిని అందరికీ పరిచయం చేశారు.


More Telugu News