పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి రూ.250 వద్ద ఆగారు... ఎంతకాలం మోసం చేస్తారు జగన్ గారూ?: లోకేశ్

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • 5 లక్షల మందికి పెన్షన్లు అందలేదని ఆరోపణ
  • అప్పు దొరకడం లేదా అంటూ వ్యంగ్యం
  • ప్రగల్భాలు ఏమయ్యాయంటూ నిలదీసిన వైనం
ఏపీలో పెన్షన్ల అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. పెన్షన్ రూ.3000కి పెంచుకుంటూ పోతామని చెప్పి, రూ.250 పెంచి ఆగిపోయారని విమర్శించారు. ఇలా అవ్వాతాతల్ని ఎంతకాలం మోసం చేస్తారు జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. ఒకటో తారీఖునే తలుపులు విరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమైపోయాయని నిలదీశారు. ఇవాళ ఒకటో తేదీ అని, రాష్ట్రంలో 5 లక్షల మందికి పింఛన్లు అందలేదని లోకేశ్ ఆరోపించారు.

"ప్రతి నెలా సాంకేతిక సమస్యలేనా? లేక, అప్పు దొరకడంలేదా? మీకు ఇవ్వాలనే మనుసుండాలి కానీ, మీవద్ద లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాళ్లనీ, వీళ్లనీ అప్పులు అడగడం బాగాలేదు. ఒక్క నెల జే ట్యాక్స్ లో 10 శాతం వెచ్చిస్తే రాష్ట్రంలో అందరికీ పెన్షన్లు ఇవ్వొచ్చు. క్విడ్ ప్రో కో ద్వారా కూడగట్టిన అక్రమాస్తుల్లో 1 శాతం అమ్మితే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయి. పింఛన్లు ఆలస్యం చేస్తే పెంపు గురించి అడగరన్న లాజిక్ తో పింఛన్ ఇచ్చే ఒకటో తేదీని అలా పెంచుకుంటూ పోతున్నారా జగన్ రెడ్డి గారూ" అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

సీఎం జగన్ కు వైసీపీ సెక్షన్లు వర్తించవా పోలీస్ దొరా!: లోకేశ్

మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను పోలీసులు కొట్టి చంపి ఏడాది దాటిందని లోకేశ్ వెల్లడించారు. నిందితులపై ఇప్పటికీ చర్యలు లేవని తెలిపారు. అంటే మాస్కు పెట్టుకోని వాళ్లను కొట్టి చంపాలని జగన్ సర్కారు చెబుతోందని అర్థం చేసుకున్నారేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి సెంటర్ లో ఎస్సై మాస్కు ధరించని వ్యక్తిని చితకబాది చంపేసేంత వరకు వెళ్లాడని లోకేశ్ ఆరోపించారు. కొడుతూ, కాలితో తన్నుతూ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఎస్సైపై ఇప్పటివరకు చర్యలు లేవని తెలిపారు. ఏపీలో వైసీపీ సెక్షన్ ప్రకారం మాస్కు లేకపోవడం చంపేసేంత నేరమైతే, సీఎం ఏ ఒక్క రోజు కూడా మాస్కు ధరించడని, ఆయనకి వైసీపీ సెక్షన్లు వర్తించవా పోలీస్ దొరా? అంటూ ప్రశ్నించారు.


More Telugu News