17 ఏళ్ల పాటు ఆడిన క్లబ్ కు వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమైన సాకర్ దిగ్గజం మెస్సీ

  • బార్సిలోనా క్లబ్ కు మెస్సీ వీడ్కోలు
  • తీవ్ర భావోద్వేగాలకు లోనైన మెస్సీ
  • ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని వెల్లడి
  • మాటలు రాక భోరున విలపించిన వైనం
అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియొనెల్ మెస్సీకి, బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ తో అనుబంధం నేటితో ముగిసింది. గత 17 ఏళ్లుగా బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ ఇవాళ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇక ఆ క్లబ్ కు ఆడే అవకాశం లేకపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ వాతావరణాన్ని బరువెక్కించాడు.

ఓ సీజన్ కు గాను మెస్సీకి బార్సిలోనా ఎఫ్ సీ ఇప్పటివరకు రూ.1200 కోట్ల వరకు చెల్లించేదని సమాచారం. అయితే మారిన నిబంధనలు, క్లబ్ ఆర్థిక పరిస్థితులు మెస్సీ వంటి ఖరీదైన ఆటగాడిని కొనసాగించేందుకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో అతడితో కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా క్లబ్ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇక వీడ్కోలు సమావేశంలో మెస్సీ మాట్లాడుతూ, ఇలాంటి రోజు వస్తుందని తన జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇప్పుడు తాను కెరీర్ చివరి అంకంలో ఉన్నానని, ఈ విధంగా వీడ్కోలు పలకాల్సి రావడం అత్యంత వేదన కలిగిస్తోందని తెలిపాడు. ఫుట్ బాల్ కెరీర్ మొత్తం బార్సిలోనా కోసం పాటుపడ్డానని వివరించాడు. తనకు పలు క్లబ్బులు ఆహ్వానం పలుకుతున్నాయని, ఏ జట్టుకు ఆడతానో తెలియదని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బార్సిలోనాను వీడడం కష్టంగా ఉందని చెబుతూ భోరున విలపించాడు.


More Telugu News