మ‌ళ్లీ అందుబాటులోకి రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ఖాతా!

  • ఇటీవ‌ల ట్విట్టర్ ఖాతా లాక్
  • నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని ఆరోప‌ణ‌
  • మ‌రికొంద‌రు కాంగ్రెస్ నేత‌ల ఖాతాలూ అన్‌లాక్‌
ఢిల్లీలో జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రుల వివరాలను వెల్ల‌డించడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తూ ఆ సామాజిక మాధ్య‌మ సంస్థ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అలాగే, మ‌రి కొంత మంది కాంగ్రెస్ నేత‌ల ఖాతాల‌ను కూడా ట్విట్ట‌ర్ బ్లాక్ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ ఇప్ప‌టికే మండిప‌డ్డారు.

తాజాగా ఆయ‌న‌ ట్విటర్‌ ఖాతాను ట్విట్ట‌ర్‌ పునరుద్ధరించింది. దీంతో ఆయన ఖాతాను ట్విటర్‌ అన్‌లాక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్ర‌క‌టించింది. రాహుల్‌తో పాటు మరికొందరు పార్టీ నేతల ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది. కాగా, ట్విట్ట‌ర్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ నిన్న నిర్ణయం తీసుకోవ‌డం, ఈ రోజు కాంగ్రెస్ నేత‌ల ఖాతాల‌ను అన్‌లాక్ చేయ‌డం గ‌మ‌నార్హం.

క‌నీసం ట్విట్ట‌ర్‌లోనైనా  ఆలోచ‌న‌లు పంచుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని భావించామ‌ని, అయితే,  ఆ సామాజిక మాధ్య‌మం కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఏది చెబితే అదే వింటోంద‌ని రాహుల్ నిన్న విమ‌ర్శలు గుప్పించారు. ట్విట్ట‌ర్ ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయన ఆరోపించారు.  


More Telugu News