అత్యంత వేగంగా సూర్యుడిని చుట్టేస్తున్న గ్రహశకలం

  • 113 రోజుల్లో సూర్యుడి చుట్టూ పరిభ్రమణ పూర్తి
  • 2021 పీహెచ్27 అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
  • చిలీలోని డార్క్ ఎనర్జీ కెమెరాలో చిక్కిన గ్రహశకలం  
కొన్ని రోజుల క్రితమే భూమికి చాలా దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకుపోయింది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ గ్రహశకలం గురించి మర్చిపోక ముందే..  ఖగోళ శాస్త్రవేత్తలు మరో గ్రహశకలాన్ని గుర్తించారు. ఇది భూమికి దగ్గర్లో కాదు సూర్యుడికి దగ్గర్లో ఉంది. చిలీలోని డార్క్ ఎనర్జీ కెమెరా (డీఈక్యామ్)తో దీనిని గుర్తించారు.

విక్టర్ ఎం బ్లాంక్ టెలిస్కోప్‌ ద్వారా సేకరించిన డేటాను పరిశీలించే సమయంలో స్కాట్ ఎస్ షెపర్డ్ అనే శాస్త్రవేత్త ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. మన సౌరవ్యవస్థలో అత్యంత తక్కువ సగటు దూరంలో ఉన్న గ్రహశకలం ఇదేనట. దీనికి 2021 పీహెచ్27 అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. దీని కక్ష్య చాలా చిన్నదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహశకలం ప్రయాణించే మార్గం.. బుధుడు, శుక్ర గ్రహాల కక్ష్యలను కొన్ని చోట్ల అధిగమిస్తుందని సమాచారం.

ఈ గ్రహశకలం అంగారక, గురు గ్రహాల మధ్య ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్‌కు చెందింది అయ్యుండొచ్చని సైంటిస్టులు అంటున్నారు. సూర్యుడికి సమీపంలోని గ్రహాల ఆకర్షణ శక్తిలో వచ్చిన మార్పుల వల్ల ఇది సూర్యుడి దగ్గరకు వచ్చినట్లు భావిస్తున్నారు. లేదంటే సౌర వ్యవస్థ బయటి నుంచి వచ్చిన గ్రహశకలం కూడా కావచ్చని అభిప్రాయపడుతున్నారు. చాలాకాలం కావడం వల్ల దీని కక్ష్య కూడా అస్థిరంగా ఉండొచ్చని, మరికొన్ని మిలియన్ల సంవత్సరాల్లో ఇది సూర్యుడిలోకి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. లేదంటే బుధ, శుక్ర గ్రహాలను ఢీకొట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు  ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.


More Telugu News