చంద్రబాబు షేర్ చేసిన వీడియోలోని వృద్ధురాలికి పెన్షన్ పునరుద్ధరణ

  • వృద్ధుల దీనగాధను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులు
  • మంత్రి శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లిన స్థానిక నేతలు
  • కలెక్టర్‌, ఇతర అధికారులతో మాట్లాడి పెన్షన్ పునరుద్ధరణ
  • వెంటనే ఇంటికి వెళ్లి అందజేసిన గ్రామాధికారులు
  • సొంత ఖర్చుతో వారికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తానన్న మంత్రి
పింఛన్ లబ్దిదారుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా తయారైందని, అందుకు ఈ వీడియోనే నిదర్శనమంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న తన ట్విట్టర్ ఖాతాలో ఓ వృద్ధురాలి వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలోని వృద్ధురాలు తన గోడును వెళ్లబోసుకుంది. తమకు పెన్షన్ నిలిపివేశారని వాపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక వైసీపీ నేతలు విషయాన్ని మంత్రి శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి తల్లీకుమార్తెల పింఛన్లను పునరుద్ధరించారు. ఆ వెంటనే కార్యదర్శి, గ్రామ వలంటీరు వారి ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు.

అసలేమైందంటే... పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని వడలి గ్రామానికి చెందిన పువ్వుల రాఘవులు, తోరం సరస్వతి తల్లీకుమార్తెలు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సరస్వతి వయసు 80 ఏళ్లు కాగా, రాఘవుల వయసు వందేళ్లు. వీరిద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. ప్రతినెల వీరికి రూ. 2,250 చొప్పున పింఛన్లు అందించేవారు. ఆ సొమ్ముతోనే వారు జీవితాన్ని వెళ్లదీసేవారు. అయితే, ఒకే రేషన్ కార్డుపై ఒకరికే పింఛను అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కారణంగా వీరికి వచ్చే పింఛను నిలిచిపోవడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి.

ఆరా తీస్తే లబ్ధిదారుల జాబితాల్లో వారి పేర్లు లేవని తెలిసి హతాశులయ్యారు. వీరి ఇబ్బందులు గమనించిన కొందరు యువకులు వారి బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే వీడియోను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా షేర్ చేశారు.

 కాగా, వీరికి వృద్ధాప్య పింఛన్ నిలిపివేతపై పెనుగొండ ఎంపీడీవో కె.పురుషోత్తమరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక రేషన్ కార్డులో రెండు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అయితే, మానవతా దృక్పథంతోనే వారి పింఛన్లు పునరుద్ధరించినట్టు చెప్పారు. కాగా, ఇక నుంచి వారికి తన సొంత ఖర్చుతో భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తానని మంత్రి ప్రకటించారు.


More Telugu News