హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తామంటూ 19 మంది దరఖాస్తు

  • అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్, బీజేపీ
  • స్పందించిన కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ
  • ఈ నెల 30 తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయం ఇంకొంచెం వేడెక్కింది. హుజూరాబాద్ బరిలో దింపే అభ్యర్థులపై అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా స్పష్టతతో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. దీనిపై పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ స్పందించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజనర్సింహ వెల్లడించారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్టు తెలిపారు.

సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చామని, ఈ నెల 30న భూపాలపల్లి సభ అనంతరం హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News