తుది నిర్ణయం ఏదైనా మోదీదే.. ఎంతైనా ప్రధాని కదా: అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఆయనో గొప్ప ప్రజాస్వామ్యవాది అని కామెంట్
  • ఎవరు చెప్పినా ఓపిగ్గా వింటారని వెల్లడి
  • మంచి చెడులను విశ్లేషించాకే తుది నిర్ణయమన్న అమిత్ షా
ప్రధాని నరేంద్రమోదీ ఓ నియంత అన్న వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. తనకు తెలిసిన ప్రజాస్వామ్యవాదుల్లో మోదీ ఒకరని అన్నారు. మోదీతో ఇటు ప్రతిపక్షం, అటు అధికార పక్షంలో కలిసి పనిచేసే అవకాశం తనకు దొరికినందుకు ఆనందంగా ఉందన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయనలా వినే వ్యక్తిని తానెన్నడూ చూడలేదని చెప్పారు. దేనిమీదైనా సమావేశం జరిగినప్పుడు ప్రధాని చాలా తక్కువ మాట్లాడుతారని, అందరూ చెప్పే దానిని ఓపిగ్గా వింటారని తెలిపారు. ఓ వ్యక్తి అభిప్రాయానికి ఆయన చాలా విలువనిస్తారని అమిత్ షా పేర్కొన్నారు. అన్నీ విన్నాక అందులోని మంచి చెడులను విశ్లేషించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఫైనల్ డెసిషన్ అయితే తనదేనని, ఎంతైనా ప్రధాని కదా అని  వ్యాఖ్యానించారు.

మోదీ పాలన చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు. ప్రభుత్వాధినేత గౌరవాన్ని ప్రతిపక్షాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని ప్రభుత్వాన్ని అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఫోరంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను లీక్ చేయరాదని, అది తప్పనే వాదనలో అర్థం లేదని అమిత్ షా పేర్కొన్నారు.


More Telugu News