ఉతప్ప, రుతురాజ్ మెరుపులు.. క్వాలిఫయర్-1లో చెన్నై విజయం, 9వసారి ఐపీఎల్‌ ఫైనల్‌లోకి

  • కీలక మ్యాచ్‌లో దుమ్మురేపిన చెన్నై
  • బ్యాట్‌తో చెలరేగిన రుతురాజ్, ఉతప్ప
  • నేడు బెంగళూరు-కోల్‌కతా మధ్య ఎలిమినేటర్ మ్యాచ్
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మూడుసార్లు టైటిల్ విజేత అయిన చెన్నై తాజాగా తొమ్మిదోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో గత రాత్రి జరిగిన క్వాలిఫయర్-1లో ఢిల్లీని ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ మునుపటి ఆటతీరు కనబరిచాడు. 6 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడు పరుగుల వద్దే డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది. రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డారు. యథేచ్ఛగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ఈ క్రమంలో గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, ఉతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. దీనికితోడు ఓవర్ తొలి బంతికే మొయిన్ అలీ (16) వికెట్ కోల్పోయింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ మరింత పెరిగింది. అయితే, ధోనీ మునుపటి ఫినిషర్‌ను తలపించి హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చాడు.

ఈ సీజన్‌లో తొలి నుంచి అద్భుతంగా ఆడుతూ వస్తున్న ఢిల్లీ కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ పృథ్వీషా, కెప్టెన్ పంత్‌తోపాటు చివర్లో హెట్‌మెయిర్ చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.

పృథ్వీషా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా నిలిచి 51 పరుగులు చేశాడు. హెట్‌మెయిర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 70 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.


More Telugu News