జీజీహెచ్ లో కలకలం.. నాలుగు రోజుల పసికందు అపహరణ!

  • అమ్మమ్మ పక్కలో ఉన్న చిన్నారి అపహరణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
  • సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు
  • వార్డులోకి ఇద్దరు అనుమానితులు వచ్చినట్టు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో దారుణం జరిగింది. అమ్మమ్మ పక్కన ఉన్న మూడు రోజుల పసికందును ఓ వ్యక్తి అపహరించాడు. సంచిలో వేసుకుని తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి దాటాక జరిగింది.

వివరాలలోకి వెళితే, పెదకాకానికి చెందిన ప్రియాంక ప్రసవం కోసం జీజీహెచ్ కు వెళ్లింది. ఈ నెల 12న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. వారి దగ్గర ప్రియాంక తల్లి, అత్త ఉన్నారు. అయితే, నిన్న అర్ధరాత్రి చిన్నారి ఏడుస్తుండడంతో అతడి నానమ్మ బయటకు తీసుకెళ్లింది. తర్వాత అమ్మమ్మ పక్కన పడుకోబెట్టి ఆమె బాత్రూంకు వెళ్లింది. తిరిగి ఆమె బయటకొచ్చి చూసేసరికి చిన్నారి కనిపించలేదు.

ఆందోళన చెందిన బాలుడి నానమ్మ, అమ్మమ్మ ఆసుపత్రి మొత్తం వెతికినా దొరకలేదు. ఆసుపత్రి సిబ్బందికి విషయం చెప్పారు. ఇవాళ ఉదయం బాధితులు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఓ మహిళ, మరో వ్యక్తి వార్డులోకి వచ్చినట్టు గుర్తించారు. వారే పసికందును అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు.


More Telugu News