అలా చేస్తేనే క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం: మోహ‌న్ భ‌గ‌వ‌త్

  • ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌రిపోదు
  • ఆజాదీ కోరుకుంటున్న వారూ మన దేశంలో విలీనం కావాలి
  • వారిని పాకిస్థాన్ ప్రోత్స‌హిస్తోంది
  • మతతత్వ భావనలు ఉన్న వారే ఆజాదీ కోసం డిమాండ్‌ చేస్తున్నారు
జమ్మూకశ్మీర్‌ స‌మ‌స్యపై రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భగవత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే దాని రద్దుతో సమస్య పూర్తిగా తొలగిపోలేదని మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు. ఆజాదీ కోరుకుంటున్న వారూ మన దేశంలో, దేశ ప్ర‌జ‌ల‌తో విలీనమయ్యేలా సమాజం ప్ర‌త్యేక చొర‌వ‌చూపాల‌ని చెప్పారు.

పాకిస్థాన్ ప్రోత్సాహంతో పాటు మతతత్వ భావనలు ఉన్న వారే ఆజాదీ కోసం డిమాండ్‌ చేస్తున్నారని ఆయ‌న చెప్పారు. ముంబైలో ఓ కార్యక్ర‌మంలో పాల్గొన్న‌ జమ్మూకశ్మీర్‌ ముస్లిం విద్యార్థులు ఇటీవ‌ల మాట్లాడుతూ భారత్‌లో తామూ ఓ భాగం కావాలని అన్న‌ట్లు చెప్పారు.

ఈ విష‌యంలో వారికి ఎలాంటి అవరోధాలు ఉండబోవ‌ని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు అభివృద్ధి జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవల తాను తన పర్యటనలో ఈ విష‌యాల‌ను గుర్తించాన‌ని తెలిపారు. అప్ప‌ట్లో జమ్మూ, లడ‌క్‌ ప్రాంతాలు వివక్షకు గురయ్యాయని ఆయ‌న  చెప్పారు.

80 శాతం ఆర్థిక వనరులు కశ్మీర్‌ స్థానిక నాయకులే కాజేసేవార‌ని, ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది కాదని ఆయ‌న తెలిపారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం అక్క‌డి ప్రజలు సంతోషంగా ఉంటున్నార‌ని చెప్పారు. ఇప్పుడు ఉగ్రవాదుల గురించి ప్ర‌జ‌లు ఆందోళన చెందట్లేద‌ని తెలిపారు.

చిన్నారుల తల్లిదండ్రుల తీరులోనూ మార్పు వ‌చ్చింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న వాతావరణం అక్కడ నెలకొందని మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు.



More Telugu News