ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నాను: అశోక్ గ‌జ‌ప‌తి రాజు

  • పైడిత‌ల్లిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు
  • ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసిన పండితులు
  • ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా శుభం క‌ల‌గాల‌ని కోరుకున్నాన‌న్న‌ అశోక్ గ‌జ‌ప‌తి రాజు 
విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు నిన్న సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ప్రారంభ‌మయ్యాయి. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి అమ్మ‌వారి మూల విరాట్‌కు క్షీరాభిషేకం చేశారు. సిరిమానోత్స‌వాన్ని సంప్ర‌దాయబ‌ద్ధంగా కొన‌సాగిస్తామ‌ని పూజారులు తెలిపారు.

ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు అమ్మ‌వారి పూజ‌ల్లో పాల్గొన్నారు. పైడిత‌ల్లిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికిన పండితులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా శుభం క‌ల‌గాల‌ని అమ్మ‌వారిని కోరుకున్నాన‌ని తెలిపారు. అలాగే, ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నానని చుర‌క‌లంటించారు.  



More Telugu News