ఈరోజు నుంచి ఏపీలో రేషన్ షాపుల బంద్.. రేషన్ దిగుమతి, పంపిణీని ఆపేసిన డీలర్లు!

  • 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను చెల్లించాలని డీలర్ల డిమాండ్
  • గోనె సంచులకు రూ. 10 ఇవ్వాలని అడుగుతున్న డీలర్లు  
  • గోనె సంచులు ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారని డిమాండ్
ఏపీలో రేషన్ షాపుల డీలర్లు బంద్ చేపట్టారు. ఈరోజు నుంచి రేషన్ దిగుమతి, పంపిణీని నిలిపివేశారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పు బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.

 డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు 2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన కమీషన్లను చెల్లించాలని కోరారు. గోనె సంచులను తిరిగి ఇచ్చేస్తే రూ. 10 చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు చెల్లింపులు చేయలేమని చెపుతోందని... ఇది సరికాదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో గోనె సంచులను తిరిగి ఇవ్వకపోతే అలాట్ మెంట్ కట్ చేసి, కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. గోనె సంచులను ప్రభుత్వం తీసుకునేలా వచ్చిన జీవో10ని పక్కనున్న తెలంగాణలో అమలు చేస్తున్నారని... ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల బంద్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


More Telugu News