అసత్య ప్రకటనలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ సర్కారు అభాసుపాలైంది: లోకేశ్

  • పెట్రో ధరల అంశంపై లోకేశ్ స్పందన
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • ఫేక్ ప్రకటనలతో మోసగిస్తున్నారని వెల్లడి
  • రెండేళ్లయినా వ్యాట్ తగ్గించలేదని వ్యాఖ్యలు
రాష్ట్రంలో పెట్రో ధరల నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా వసూల్ రెడ్డి మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటూ ప్రకటనలు ఇస్తున్నాడని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజాధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశచరిత్రలో జగన్ ఒక్కడేనని పేర్కొన్నారు. తాజా ప్రకటనలు ఆయన తుగ్లక్ తనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అసత్య ప్రకటనలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ సర్కారు అభాసుపాలైందని లోకేశ్ పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో ప్రజలపై భారాన్ని తగ్గించడానికి రూ. 4 వ్యాట్ ను రూ.2కి తగ్గించిన విషయాన్ని దాచిపెట్టి ఫేక్ ప్రకటనలు ఇస్తున్నారని, తద్వారా వసూల్ రెడ్డి ఫేక్ బ్రతుకు బయటపెట్టుకుంటున్నారని వివరించారు. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుంది అని గతంలో చిలక పలుకులు పలికిన మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదు అని లోకేశ్ ప్రశ్నించారు.

కేవలం రూ.1 సెస్ వేస్తామంటూ అసత్యాలు చెబుతున్నారని, కానీ డీజిల్ లీటరుపై రూ.4 వరకు అదనపు వ్యాట్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.7.59, డీజిల్ పై రూ.5.49 వరకు పన్నుల రూపంలో అధికంగా బాదేస్తోందని కేంద్రమే చెబుతోందని తెలిపారు. ప్రజలను దోచుకుంటున్న వసూల్ రెడ్డి పోసుకోలు కబుర్లు, ఫేక్ ప్రకటనలు మాని వెంటనే పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.


More Telugu News