నేను మౌనంగా ఉన్నన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడావు: బండి సంజయ్ పై సీఎం కేసీఆర్ ఫైర్

  • సీఎం కేసీఆర్ తాజా ప్రెస్ మీట్
  • బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు
  • హద్దు మీరింది మీరేనంటూ ఆగ్రహం
  • మేం ఎవరికీ భయపడం అంటూ వెల్లడి
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏం హద్దు మీరి మాట్లాడాను... వడ్లు కొంటారా కొనరా అని అడగడం కూడా హద్దుమీరినట్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పెట్రోలు మీద అబద్ధాలు చెప్పి సెస్ లు వేసింది ఎవరు? దానిపై నువ్వు మాట్లాడవు. అవన్నీ వదిలేసి నువ్వు ఫాంహౌస్ లో పడుకున్నావా? అంటూ మాట్లాడతారు. అది నా నియోజకవర్గం, నా వ్యవసాయ క్షేత్రం. ఇవాళ నన్ను పట్టుకుని తెలంగాణలో నువ్వెక్కడున్నావ్, ఉద్యమంలో నువ్వెక్కడున్నావ్ అని అడుగుతావా? అసలు పార్లమెంటులో తెలంగాణపై ఓటింగ్ జరిగినప్పుడు నువ్వెక్కడ ఉన్నావ్... అప్పటికి పార్లమెంటు ముఖమైనా చూశావా?

అడ్డగోలుగా మాట్లాడడం తప్ప నువ్వు తెలంగాణకు ఏమైనా చేశావా? కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చావా? ఆ విషయం మేమడిగితే తప్పా? ఏం... తెలంగాణ ఓ మెడికల్ కాలేజీకి నోచుకోలేదా? కొత్త జిల్లాలు ఏర్పడ్డాక నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని 50 దరఖాస్తులు ఇచ్చినా  దిక్కులేదు. స్థలాలు చూపించలేదని మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా మంచి పథకం మేం ప్రారంభిస్తే... కేసీఆర్ తన ఇంట్లోంచి తెచ్చి ఇస్తున్నాడా అంటూ వింత ప్రచారం చేస్తారు. మరి నువ్వు నీ ఇంట్లో నుంచి తెచ్చి ఇస్తున్నావా?

మొండిగా, తల తోక లేని వితండ వాదాలు తప్ప మరేమీ లేదు. మీకు లొంగకపోతే ఐటీ, ఈడీ దాడులు చేయిస్తారా? మీకు దొంగలు భయపడాల్సిందే తప్ప మేం కాదు. మాకేమీ మనీ లాండరింగ్ దందాలు, వ్యాపారాలు, కంపెనీలు ఏమీ లేవు. నేను, నా కొడుకు మా 100 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. మేం నిటారుగా, నికార్సుగా ఉన్నాం... మమ్మల్నేమీ చేయలేరు. వాళ్లను, వీళ్లను భయపెట్టినట్టు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారేమో... మేం బెదిరిపోయేవాళ్లం కాదు. లొసుగులు లేవు కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నాం, ఎవరితోనైనా, ఎంతదాకైనా పోట్లాడతాం.

నేను మౌనంగా ఉన్నన్ని రోజులు నీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం మాట్లాడావు. కేసీఆర్... నీ ఫాంహౌస్ కు వచ్చి దున్నుతా అని నీ దిక్కుమాలిన పాదయాత్రలో 50 సార్లు అన్నావు.... నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్ వా? మా ఫాంహౌస్ లో ఓ వర్కర్... ఈయన లేస్తే మన ఫాంహౌస్ దున్నుతానంటున్నాడు, ఆయనకేమైనా ట్రాక్టర్ డ్రైవర్ పని కావాల్నా? అని అంటున్నాడు" అని వివరించారు. కాగా ఇకపై రోజూ ప్రెస్ మీట్ పెడతానని కేసీఆర్ వెల్లడించారు.


More Telugu News